సూపర్ స్టార్ రాజకీయ రంగ ప్రవేశం – త్వరలో సొంత పార్టీ ప్రకటన

86

THE BULLET NEWS (CHENNAI)-తమిళ ప్రజలకు సూపర్‌స్టార్ రజనీకాంత్ కొత్త సంవత్సర కానుకగా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అభిమానులతో గత ఐదు రోజులుగా సమావేశమవుతున్న రజనీకాంత్ ముందుగా ప్రకటించినట్టుగానే అశేషాభిమానుల సమక్షంలో తన రాజకీయ ప్రవేశంపై ఉత్కంఠకు తెరదించారు. అభిమానుల హర్షధ్వానాల మధ్య ‘రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా’ అని ప్రకటించారు. రాఘువేద్ర హాలులో ఆదివారంనాడు అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ, రాజకీయాలకు భయపడనని, మీడియా అంటేనే భయమని నవ్వుతూ చెప్పారు. పేరు, డబ్బు కోసం రాజకీయాల్లోకి రావడం లేదని, వ్యవస్థలో మార్పు తీసుకురావడమే తన ఉద్దేశమని అన్నారు.

రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు ఇదేసరైన తరుణమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఇంతకాలం తనను వెన్నంటి నిలిచిన అభిమానులకు, తమిళ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ ప్రవేశంపై ప్రకటనకు ముందు కొద్ది నిమిషాలు ధ్యానముద్రలో ఉన్న రజనీ….’కర్మణ్యే వాధికారస్తే’ అంటూ ప్రారంభించి ప్రసంగం చివర్లో జైహింద్ అంటూ ముగించారు. రజనీకాంత్ ప్రకటనతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

SHARE