సీఎంగారూ.. ప్రత్యేక ప్యాకేజీ ఆంతర్యమేంటో చెప్పండి – ఎమ్మెల్యే కాకాణి డిమాండ్

108

The bullet news (Podalakuru)-  ప్రత్యేకహోదాను కాదని, చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకోవడంలో ఉన్న ఆంతర్యమేంటో రాష్ట్ర ప్రజలకు వెల్లడించాలని వైఎస్సార్‌ సీపీ నెల్లూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పొదలకూరు ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హోదా వస్తే జిల్లా రూపురేఖలే మారిపోయేవన్నారు. వైఎస్సార్‌ హయాంలో పోర్టు రావడంతో పరిశ్రమలు వచ్చాయన్నారు. హోదా ఉంటే పన్ను రాయితీల వల్ల తమిళనాడు నుంచి పరిశ్రమలు తరలివస్తాయన్నారు. హోదా సాధన కోసం వైఎస్‌ జగన్‌ దేనికైనా సిద్ధంగా ఉన్నారని, రాష్ట్ర ప్రయోజనాల ముందు వైఎస్సార్‌ సీపీకి ఏది ముఖ్యం కాదన్నారు. పొదలకూరులో ప్రజాసంకల్ప యాత్రను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.

వైఎస్‌ జగన్‌ దృష్టికి పొదలకూరు సమస్యలు
పొదలకూరులో నెలకొన్న సమస్యలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లానని, ప్రభుత్వం వస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని కాకాణి వెల్లడించారు. కండలేరు ఎడమగట్టు కాలువ వెడల్పు పెంచి ఎత్తిపోతల పథకం వద్ద మోటార్ల సంఖ్య పెంచి 20,700 ఎకరాల్లో పంటలు పండిస్తామన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పిన కొందరు ప్రస్తుతం 2,500 ఎకరాలకు కూడా ఎత్తిపోతల ద్వారా సాగునీటిని ఇవ్వలేకపోతున్నట్టు విమర్శించారు. సోమశిల దక్షిణ కాలువకు నీరు–చెట్టులో సైఫన్‌ ఏర్పాటుచేసి వేల ఎకరాలకు నీరు సరఫరా చేస్తున్నట్టు కలరింగ్‌ ఇస్తున్నట్టు తెలిపారు.

దక్షిణ కాలువ అటవీ భూములకు అనుమతులు తేవడంతో పాటు, పెండింగ్‌ పనులు పూర్తిచేసి రైతులకు సాగునీటిని అందజేసి చూపుతామన్నారు. నిమ్మరైతులను ఆదుకోవడంతో పాటు, నిమ్మకు మద్దతు ధర ప్రకటిస్తామన్నారు. పొదలకూరులో డిగ్రీకాలేజీ ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, పొదలకూరు సర్పంచ్‌ తెనాలి నిర్మలమ్మ, ఎంపీటీసీ కండే సులోచన, జిల్లాపార్టీ కార్యదర్శి గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, మండలపార్టీ అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, పి.పోలిరెడ్డి, చిల్లకూరు బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

SHARE