కావ‌లిలో దారుణం.. చిమ్మచీకటిలో పసిబిడ్డ

95

The bullet news (Kavali)-  కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాల సిబ్బంది నిర్వాకంతో అప్పుడే పుట్టిన పసిబిడ్డ మూడు గంటల పాటు చిమ్మచీకటిలో ఆర్తనాదాలు చేస్తూ ఉండాల్సి వచ్చింది. బోగోలు మండలం బిట్రగుంటకు చెందిన యు.అంజలి పురుడు కోసం గురువారం కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు వచ్చింది. మధ్యాహ్నం 2.50 గంటలకు డాక్టర్లు ఆమెకు ఆపరేషన్‌ చేసి మగబిడ్డను కాన్పు చేశారు. అనంతరం 3.20 గంటలకు ఆమెను అప్పుడే పుట్టిన బిడ్డతో సహా పే వార్డులోని రూం నంబరు 2లోకి మార్చారు.

అయితే రూంలో లైటు పని చేయలేదు. ఈ విషయం గమనించిన డ్యూటీ సిస్టర్‌ వెంటనే ఎలక్ట్రీషియన్‌కు సమాచారమందించారు. అయితే ఎలక్రీషియన్‌ 6.25 గంటలకు వచ్చి లైట్‌ను సరిచేసి వెళ్లాడు. అయితే మూడు గంటల పాటు ఆ చిన్నారి ఏడుస్తూనే ఉంది. ఆపరేషన్‌ చేయించుకున్న పేషెంట్‌ పొత్తిళ్లలో బిడ్డతో సహా అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. వీరి బాధ చూడలేక అక్కడ విధులలో ఉన్న సిబ్బంది పదే పదే ఫోన్లు చేయడంతో ఎలక్ట్రీషియన్‌ తీరుబడిగా 3గంటల తర్వాత వచ్చి లైటు సరిచేయడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు బాగా చేస్తున్నారని వస్తే సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారేంటని అంజలి కుటుంబ సభ్యులు వాపోయారు.

SHARE