నాగవైష్ణవి హత్యకు ఎనిమిదేళ్లు… ఇవాళ తుదితీర్పు

173

The bullet news (Crime)-  చిట్టితల్లి నాగవైష్ణవి బలై ఎనిమిదేళ్లు గడిచింది. ఆస్తుల వివాదంలో నాగవైష్ణవి హత్య జరగడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసులో కోర్టు తుది తీర్పు గురువారం వెలువడనుంది. ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితులకు కోర్టు శిక్షలు ఖరారు చేయనుంది. కోర్టు వెలువరించే తుది తీర్పుపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. మరి ఆస్తుల గొడవలో దుండగులు నాగవైష్ణవిని ఎందుకు బలిచేశారు?

విజయవాడలో సంచలనం రేపిన నాగవైష్ణవి హత్య కేసులో గురువారం తుది తీర్పు వెలువడ నుంది.. ఆస్తుల గొడవలో చిట్టితల్లి నాగవైష్ణవిని ఎనిమిదేళ్ల క్రితం అత్యంత దారుణంగా హత్య చేశారు కిరాతకులు. మర్డర్ తర్వాత నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లంతా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు….

విజయవాడ ముత్యాలంపాడుకు చెందిన పలగాని ప్రభాకర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయనకు ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు. వెంకటేశ్వరమ్మకు సంతానం కలగకపోవడంతో నర్మదను వివాహం చేసుకున్నాడు. ఆమెకు సాయితేజ, నాగవైష్ణవి జన్మించారు. మొదటిభార్యకు కూడా ఒక కొడుకు పుట్టాడు. కానీ నాగవైష్ణవి పుట్టిన తర్వాత వ్యాపారంలో కలిసిరావడంతో తన పుట్టిన రోజున తన గారాలపట్టికి ఇబ్రహీంపట్నంలో ఒక వెంచర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు ప్రభాకర్. రెండో భార్య సంతానానికి ప్రధాన్యతనివ్వడంపై మొదటి భార్య తమ్ముడు పంది వెంకట్రావు పగతో రగిలిపోయాడు. తన అక్క కొడుకును నిర్లక్ష్యం చేస్తున్నాడని బావపై పగ పెంచుకున్న వెంకట్రావు… రెండో భార్య సంతానాన్ని ఖతం చేయాలని స్కెచ్ వేశాడు…

తన ప్లాన్‌లో మిత్రులను చేర్చుకున్నాడు వెంకట్రావు. మిత్రుడు జగదీష్, సమీప బంధువు శ్రీనివాసరావుతో కలిసి నాగవైష్ణవి హత్యకు కుట్రచేశాడు. 2010 జనవరి 30న ఉదయం ఏడున్నర గంటలకు తన అన్నతో కలిసి కారులో స్కూలుకు బయలు దేరింది నాగవైష్ణవి. బీఆర్‌టీఎస్ రోడ్డులో కారును అడ్డగించి నాగవైష్ణవిని కిడ్నాప్ చేశారు దుండగులు. అడ్డుకోబోయిన కారు డ్రైవర్‌ను పొడిచి చంపారు. ఈ ఘటన జరుగుతుండగా నాగవైష్ణవి సోదరుడు సాయి దుండగుల నుంచి తప్పించుకున్నాడు. కిడ్నాప్ చేసిన నాగవైష్ణవిని కనికరం లేకుండా హత్యచేసి గుంటూరులోని ఓ బాయిలర్‌లో పడేసి కాల్చి బూడిద చేశారు కిరాతకులు. ఫిబ్రవరి 2న ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తన గారాలపట్టి మరణవార్తవిన్న వెంటనే ప్రభాకర్ గుండె ఆగిపోయింది. చిట్టితల్లి కోసం తండ్రి గుండె పోటుతో మరణించడం అందరినీ కలిచివేసింది….

ఈ దారుణ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అప్పటి ప్రభుత్వం… నేరస్థులను వెంటనే పట్టుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు వారం రోజుల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నాగవైష్ణవి కుటుంబం న్యాయం కోసం ఎదురుచూస్తోంది. ఎనిమిదేళ్ల తర్వాత గురువారంతీర్పు వెలువడడనుండడంతో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
కోర్టు వెలువరించే తీర్పుతో నాగవైష్ణవి ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆమె కుటుంబం అంటోంది. పగ, ఆస్తి తగాదాలకు తండ్రీకూతురిని బలితీసుకున్న కిరాతకులకు కఠిన శిక్షలు పడతాయని నాగవైష్ణవి కుటుంబం భావిస్తోంది.
SHARE