నకిలీ డెత్‌సర్టిఫికెట్‌తో ‘ఎల్‌ఐసీ’ సొమ్ము కాజేసి ఇలా దొరికిపోయాడు

87

The bullet news(hyderabad)-నగరంలో పలు దేవాలయాల్లో పూజలు చేస్తున్న ఓ పూజారి ఎల్‌ఐసీ సంస్థకు శఠగోపం పెట్టేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఈ నేరంలో పూజారికి సహకరించిన మరో నలుగురు నిందితులను సుల్తాన్‌ బజార్‌ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌స్టేషన్‌లో తూర్పుమండలం డీసీపీ సి. శశిధర్‌రాజు, సుల్తాన్‌ బజార్‌ ఎసీసీ చక్రవర్తి, సీఐ పి.శివశంకర్‌లతో కలిసి నిందితుల వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లాకు చెందిన ఎ.రవిశంకర్‌ శర్మ (38), భార్య ఉషశ్రీలు వృత్తిరీత్యా నగరంలోని పలు దేవాలయాల్లో ప్రతిరోజు పూజలు నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. శర్మ పేరిట కోఠి పుత్లీబౌలి ఎల్‌ఐసీ బ్రాంచి, చైతన్య పురిలోని బ్రాంచ్‌లో మూడేళ్లుగా ఎల్‌ఐసీ పాలసీలు కడుతున్నాడు. ఎల్‌ఐసీ ఏజెంటు పుల్లారెడ్డితో పాలసీలను ప్రతినెలా రవిశంకర్‌శర్మ కట్టిస్తుండేవాడు. నకిలీ డెత్‌సర్టిఫికెట్‌తో ఎల్‌ఐసీ సంస్థ నుంచి నగదు దోచుకునేందుకు పరిచయం ఉన్న మహ్మద్‌ ముజిబ్‌ఉల్లాఖాన్‌, కాజా ఆరీఫ్‌ ఉద్దీన్‌, ఎల్‌ఐసీ ఏజెంట్‌ పుల్లారెడ్డితో కలిసి పథకం రచించారు

      రవిశంకర్‌ శర్మ చనిపోయినట్లుగా నల్గొండ మున్సిపల్‌ కార్యాలయంలో రెవెన్యూ అధికారి ఆరీఫ్‌ఉద్దీన్‌ను కలిసి రూ.16 వేలు చెల్లించి సర్టిఫికెట్‌ పొందాడు. సర్టిఫికెట్‌ను పాలసీ ఏజెంటయిన పుల్లారెడ్డికి ఇచ్చి పాలసీదారుడు చనిపోతే వచ్చే క్లేమ్‌ నగదు రూ.14,15,736 తీసుకునేందుకు ప్రయత్నించారు. పుత్లిబౌలీలోని ఎల్‌ఐసీ కార్యాలయంలో 3 లక్షల 31 వేలకు దరఖాస్తు చేసి, మిగతా నగదు చైతన్యపురి ఎల్‌ఐసీ బ్రాంచిలో 10 లక్షల 80 వేలకు దరఖాస్తు చేసుకున్నారు. ఎల్‌ఐసీ ఉన్నతాధి కారులు డెత్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా నగదును నామిని అయిన శర్మ భార్య ఉషశ్రీకి అందజేశారు. కొన్ని రోజుల తర్వాత తిరిగి పై రెండు బ్రాంచీల్లో మూడేళ్ల లోపు ఉన్న రూ.5 లక్షలకు చెందిన మరో రెండు పాలసీలకు క్లెయిమ్‌కు దరఖాస్తు చేశారు. ఈ రెండు పాలసీలు మూడేళ్ల లోపు ఉండటంతో అనుమానం వచ్చిన ఎల్‌ఐసీ అధికారులు మరోసారి విచారణ చేపట్టారు. నల్గొండ మున్సిపల్‌ కమిషనర్‌ను కలిసి రవిశంకర శర్మ డెత్‌ సర్టిఫికెట్‌పై విచారణ చేయాలని కోరారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇది నకిలీ సర్టిఫికెట్‌ అని తేల్చడంతో ఎల్‌ఐసీ ఉన్నతాధికారులు శర్మపై ఫిర్యాదు చేశారు.
          పోలీసులు రవిశంకరశర్మ, ఎల్‌ఐసీ ఏజెంట్‌ పుల్లారెడ్డి, రెవెన్యూ ఆఫీసర్‌ ఆరీఫ్‌ ఉద్దీన్‌, అతని స్నేహితుడు మహ్మద్‌ ముజీబ్‌ఉల్లాఖాన్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రవిశంకర శర్మ భార్య ఉషశ్రీ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి రూ.65 వేల నగదు, మూడు నకిలీ డెత్‌సర్టిఫికెట్లు, పాలసీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
SHARE