రోజుకో మలుపు తిరుగుతోన్న టీటీడీ వివాదం

91

The bullet news (TTD)_  టీటీడీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తీవ్ర ఆరోపణలతో కలకలం రేపిన రమణదీక్షితులు, విజయసాయిరెడ్డికి టీటీడీ నోటీసులు పంపింది. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని… లేదంటే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇక టీటీడీ ప్రధానార్చకులు సుప్రీంను ఆశ్రయించారు. తన నియామకాన్ని ఎవరూ ప్రశ్నించకుండా కెవియట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. రమణదీక్షితులు కంటే ముందే టీటీడీ ప్రధానార్చకుడు వేణుగోపాలదీక్షితులు కెవియట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తనను అన్యాయంగా అర్చక పదవి నుంచి తొలగించారంటూ, సుప్రీంను ఆశ్రయిస్తానని రమణదీక్షితులు ప్రకటించడంతో… వేణుగోపాలదీక్షితులు జాగ్రత్తపడ్డారు. తన నియామకాన్ని ప్రశ్నిస్తూ… ఎవరైనా పిటిషన్ వేస్తే… తన వివరణ తీసుకోకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దంటూ కెవియట్‌ దాఖలు చేశారు.

ఇదిలా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించారంటూ రమణదీక్షితులు, విజయసాయిరెడ్డికి టీటీడీ నోటీసులు పంపింది. ఆరోపణలకు వివరణ ఇవ్వాలని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే తనకెలాంటి నోటీసులు అందలేదన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… మరోసారి చంద్రబాబుకి సవాలు విసిరారు. దమ్ముంటే… టీటీడీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

శ్రీవారి ఆజ్ఞ లేకుండా తిరుమల కొండపై ఏమీ జరగదని…. టీటీడీలో నెలకొన్న తాజా వివాదం కూడా స్వామివారే సృష్ణించి ఉంటారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈవో రమణాచారి అభిప్రాయపడ్డారు. మొత్తానికి అనేక మలుపులు తిరుగుతోన్న టీటీడీ వివాదం… చివరికి సుప్రీంకోర్టుకు చేరగా, ఇక సంచలన ఆరోపణలతో కలకలం రేపిన రమణదీక్షితులు, విజయసాయిరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం నోటీసులు పంపడంతో… వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.

SHARE