చిట్టి బుర్రలలో.. గట్టి ఆలోచనలు

85

The bullet  news(story)-ఆ చిన్నారుల ఆవిష్కరణలు నేటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవి. పేదలకు, అందరికి అధునాతన పరిజ్ఞానం అందుబాటులో ఉండేలా అతి తక్కువ ఖర్చుతో జిల్లాకు చెందిన బాలలు రూపొందించిన ఈ నమూనాలు విశాఖపట్నంలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక పోటీల్లో జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యాయి. ఈ బాల శాస్త్రవేత్తలు సమాజానికి ఉపయోగపడేలా తయారుచేసిన పలు పరికరాలు, వాటి సాంకేతిక పరిజ్ఞానంపై న్యూస్‌టుడే బృందం అందిస్తున్న ప్రత్యేక కథనం..                                                                                                                                                                                 మత్యకారులకు అండ
విద్యార్థి పేరు : ఉదయగిరి మహేష్‌, ఎనిమిదో తరగతి జలదంకి మండలం లింగరాజు అగ్రహారం
నమూనా: ‘మెరైన్‌ గ్రైండింగ్‌ క్యాప్సిలస్‌’
ప్రయోగం : సముద్రంలో చిన్నపాటి పడవల్లో వేటకు వెళ్లే మత్స్యకారులకు అనుకోని ఘటనల్లో ప్రమాదాలు వాటిల్లినప్పుడు వారిని కాపాడేందుకు రూపొందించిన పరికరం ఇది.

తయారీ ఇలా..
ఎలక్ట్రానిక్‌ పరికరాలు, జీపీఎస్‌ వ్యవస్థ, కొన్ని చిన్నపాటి యంత్రాలు
స్ఫూర్తి : పాఠశాల సైన్స్‌ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో రూపకల్పన చేశారు.
ప్రయోజనం : సముద్రాల్లో మత్స్యకారులు లేదా ఇతరులకు ప్రమాదాలు వాటిల్లినపుడు బాధితులు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకొని వారికి సహాయ చర్యలు అందించేందుకు వినియోగించవచ్చు.
వినూత్నం.. ప్రజాప్రయోజనం
విద్యార్థి పేరు : పఠాన్‌ సుమియా, ఏఎస్‌పేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల
నమూనా : ఎయిర్‌ కూలర్‌ బస్‌
ప్రయోగం : బస్సుకు ఎయిర్‌ కూలర్‌ పరికరాలను అమర్చడం ద్వారా వేసవి ఎండల నుంచి ఉపశమనం కల్పించడం.

ఆలోచన ఇలా..
బంధువుల ఇంటికి వేసవి కాలంలో వెళ్లగా ఉపశమనం కలిగేందుకు అక్కడ కూలô్ను పెట్టారు. వడదెబ్బ తగలకుండా ఉండేందుకు కూలర్‌ పెట్టినట్లు చెప్పారు. దాంతో ఎండల్లో ప్రయాణాలు చేసేవారికి ఇలా చల్లదనం ఉంటే ఉపశమనం ఉంటుంది కదా అనిపించింది. దీనిపై సైన్సు ఉపాధ్యాయులు అజాజ్ని సంప్రదించగా అలాంటి ఏర్పాటు ఆర్టీసీ బస్సుల్లోను చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఆయన సూచనలతో ప్రదర్శన తయారుచేశారు.
తయారీ..
ముందుగా అట్టలతో బస్సు నమూనా తయారుచేసుకున్నాను. కిటికీ సగభాగానికి మెష్‌ ఉండేలా ఏర్పాటు చేసుకున్నా. దానికి ఫ్రేంను తయారుచేసుకున్నా. ఈ బస్సులోపల నీళ్లట్యాంకు పెట్టాం. తరువాత సబ్‌మెర్సిబుల్‌ పంప్‌ ద్వారా నీటిని ఫ్రేం పైన పడేలా చేశాను. పైన పడే నీరు కిందకి దిగి పైపుల ద్వారా బయటికి వస్తుంది. అదే నీరు రీసైక్లింగ్‌ పద్ధతిలో ట్యాంకులోకి చేరుతుంది. బస్సు వెళ్లే సమయంలో వేడిగాలి మెష్‌కు తగిలి లోపలికి వస్తుంది. వాటిని తడిపినందున చల్లనిగాలిగా మారుతుంది. బాష్పీభవన సూత్రంపై ఆధారపడి మా ప్రయాగం పనిచేస్తుంది. వాడినవి ఇనుప పైపులు, హోంషీట్్స, ప్లాస్టి్ పైపులు, మెష్‌, సబ్మెర్సిబుల్‌ పంపు ఒకటి.
స్ఫూర్తి..  పాఠశాలలోని భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు అజాజ్‌.
ప్రయోజనం..
వేసవికాలంలో వృద్ధులు, పిల్లలు బస్సుల్లో ప్రయాణించాలంటే ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనివల్ల బస్సులో కూర్చున్న వారు వడదెబ్బ తగలకుండా చల్లని వాతావరణంలో సులభంగా ప్రయాణం చేయగలుగుతారు.
శిథిలాల్లో చిక్కినవారిని గుర్తించే క్వీన్‌
విద్యార్థి పేరు : జి. మేఘన, 9వ తరగతి, కావలి నారాయణ పాఠశాల
నమూనా : విపత్తుల బాధితులను గుర్తించే పరికరం
ప్రయోగం : ఈ పరికరంలో సెన్సార్లు, కెమెరాలు, వేడిని గుర్తించే అలారం ఏర్పాటు చేశారు.

ఆలోచన ఇలా..
భూకంపాలు తదితర విపత్తుల్లో చిక్కుకుని పలువురు మృతి చెందుతున్నట్లు వస్తున్న వార్తలతో ఆ మరణాలు నివారించాలని ఆలోచించారు.
స్ఫూర్తి : పాఠశాల ఉపాధ్యాయినులు కెజియా, తేజస్విని ప్రోత్సహించారు. మానవాళికి ఉపయోగపడేలా నూతన ఆలోచన చేశారు.
ప్రయోజనం
ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు, అనుకోని ఘటనల వల్ల శిథిలాల్లో చిక్కుకున్నవారిని గుర్తించడం చాలా కష్టతరంగా ఉంటుంది. ఈ సమయంలో చకచక డ్రోన్‌ వంటి ఈ యంత్రాన్ని శిథిలాల చుట్టూ తిప్పి చిక్కుకున్నవారిని గుర్తిస్తే వెంటనే అక్కడ శిథిలాలు తొలగించడం, బాధితులకు వెంటనే వైద్యం అందించేందుకు వీలుగా ఉంటుంది. దీనిని ఆపరేట్‌ చేయడం ద్వారా శిథిలాల్లో చిక్కుకున్నవారిని గుర్తిస్తుంది. వారున్న చోట వేడిని గుర్తించేందుకు అలారం ఏర్పాటు చేశారు. ఈ పరికరానికి క్వీన్‌ అనే పేరు పెట్టారు.

అందరికీ ఉపయోగమే..
విద్యార్థి పేరు : కె. రాధాకృష్ణ, 10వ తరగతి, కలిగిరి ఉన్నత పాఠశాల
నమూనా : నేల ఎత్తుపల్లాలను గుర్తించే పరికరం
ప్రయోగం : ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో ఆవరణ చదునుగా, సమానంగా ఉందో లేదో గుర్తించే పరికరం

ఆలోచన ఇలా..
రాధాకృష్ణ తొమ్మిదవ తరగతి చదువుతుండగా ఒక ఆలోచన చేశాడు. ఇందులో భాగంగా నేలపై వృత్తలేఖినికి పెన్సిల్‌ అమర్చి బొమ్మలు గీస్తుండగా నేలపై హెచ్చుతగ్గులు ఉన్నట్లు గమనించాడు. ఆ హెచ్చుతగ్గులను తెలుసుకొనేందుకే చేసిన ఆలోచనలో భాగంగానే ఈ ప్రయోగం అతనికి తట్టింది.

సైన్స్‌ ఉపాధ్యాయుడి స్ఫూర్తితో..
రాధాకృష్ణ తన ఆలోచనలను ఆ పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు విజయ్‌కుమార్‌కు వివరించాడు. రాధాకృష్ణలో ఉన్న సృజనాత్మకతను ఆయన గుర్తించి ప్రధానోపాధ్యాయులు శ్రీరామమూర్తికి వివరించారు. వారిద్దరూ అతడిని ప్రోత్సహించారు. భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు విజయ్‌కుమార్‌ సహకారంతో రాధాకృష్ణ తన ప్రయోగాన్ని రూపొందించాడు. ఆ ప్రయోగమే నేడు జాతీయ స్థాయికి ఎంపికైంది.
తయారీ..
ఇందులో రిమోట్తో పనిచేసే నాలుగు చక్రాల వాహనం ఉంటుంది. దానికి వెనుక వేరుగా రెండు చక్రాలు అమర్చిన ఇరుసు ఉంటుంది. దానిపై ఒక కడ్డీని అమర్చి దానిని ఎల్‌ ఆకారంలో వంచి ఆ కడ్డీని నాలుగు చక్రాల వాహనానికి అతికించిన స్కేలుపై కదిలేలా అమర్చాలి. ఇది నేలపై నడిచేటపుడు, టైల్స్‌పైన ఇతరత్రా గచ్చులపై ఉన్న హెచ్చుతగ్గులను దాటేటపుడు ఇనుప కడ్డీ కిందకు, పైకి జరిగి స్కేలుపై హెచ్చుతగ్గులను మిల్లీమీటర్లు లేదా సెంటీమీటర్లలో సూచిస్తుంది. ఈ ఇనుప కడ్డీకి బల్బును అమర్చి విద్యుత్తు వలయాన్ని ఏర్పాటు చేయాలి.
ప్రయోజనం
నేలపై ఈ పరికరాన్ని ముందుకు నడిపిస్తే హెచ్చుతగ్గులను దాటేటపుడు బల్బు వెలుగుతుంది. నేలపై ఉన్న హెచ్చుతగ్గుల రీడింగ్‌ నమోదు చేసుకోవచ్చు. అనంతరం ఆ కొలతల మేరకు చదును చేసుకుని దానిపైన ఇళ్లలో టైల్స్‌, మార్బుల్స్‌ చక్కగా అమర్చుకోవచ్చు. ఇదేవిధంగా పెద్ద పెద్ద ఫ్లాట్పాంలపై కూడా హెచ్చుతగ్గులు లేకుండా సులభంగా, చదునుగా నిర్మించుకోవచ్చు. సాధారణంగా ఇళ్లలో ఫ్లోరింగ్‌ చేసేటపుడు టైల్స్‌ను హెచ్చుతగ్గులుగా అమర్చడం జరుగుతుంది. ఆ హెచ్చుతగ్గులను సరిదిద్దేందుకు సులభ పరిష్కారంగా ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది.

మురుగునీటి పైపులు సులభంగా శుభ్రం
విద్యార్థి పేరు : పి.ఫణిశశాంక్‌, ఎనిమిదో తరగతి, యూఎన్‌ఆర్‌ హైస్కూల్‌, నెల్లూరు
నమూనా : ‘డ్రెయినేజ్‌ పైప్‌ క్లీనింగ్‌’
ప్రయోగం : ఎలక్ట్రానిక్‌ యంత్రాలతో డ్రెయినేజీ శుద్ధి
ఆలోచన ఇలా..
గతంలో డ్రెయినేజీ పైపులు శుభ్రం చేసేందుకు దిగి మృత్యువాత పడ్డవారిని దృష్టిలో ఉంచుకొని అలాంటివి జరగకూడదని దీన్ని రూపొందించాడు.
ప్రయోజనం
మహానగరాల్లో భూగర్భ డ్రెయినేజ్‌ పైపులను సులభంగా శుద్ధి చేసే పరికరం ఇది. ఈ పైపుల్లో కార్మికులు దూరి శుద్ధి చేయడం ప్రమాదకరం. అతి తక్కువ ఖర్చుతో రూపొందించిన యంత్రం.

 

SHARE