పంచమి తీర్థ ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి ఈఓ

102

The Bullet News ( tirumala ) _తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన నవంబరు 23వ తేదీన జరుగనున్న పంచతీ తీర్థం ఏర్పాట్లను మంగళవారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పంచమీ తీర్థం నిర్వహణకు అవసరమైన ఇంజినీరింగ్‌  పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు, తిరిగి వెళ్లేందుకు మొత్తం 31  గేట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉండడంతో టిటిడి విజిలెన్స్‌ సిబ్బంది పోలీసులతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఉదయం 11.48 గంటలకు  చక్రస్నానం  కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. పంచమీ తీర్థం ప్రభావం రోజంతా ఉంటుందని, భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్యస్నానాలు ఆచరించాలన్నారు.

తిరుపతి జెఈవో మాట్లాడుతూ పుష్కరిణిలో స్నానం చేసి వెలుపలికి వచ్చే సమయంలో, స్నానం కోసం భక్తులు పుష్కరిణిలోకి ప్రవేశించే సమయంలో అప్రమత్తంగా ఉంటే ఎలాంటి తోపులాటకు ఆస్కారం ఉండదన్నారు. నిర్దేశించిన ప్రాంతాల్లోనే వాహనాలను పార్క్‌ చేసి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన భక్తులను కోరారు.

అంతకుముందు ఈవో, తిరుపతి జెఈవో, సివిఎస్వోలు ఇంజినీరింగ్‌, పోలిస్‌, విజిలెన్స్‌ అధికారులతో కలిసి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఘంటశాల విగ్రహం వద్ద గల గేటును, ఆస్థాన మండపం వద్ద గల గేటును, పుష్కరిణికి పడమర ప్రక్క గల గేటును, అక్కడ ఏర్పాటు చేసిన క్యూలైన్లను జెఈవో పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో సి.ఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎ.ఎస్‌.పి శ్రీ ఎమ్‌విఎస్‌ స్వామి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌ రెడ్డి, టిటిడి ఇంజినీరింగ్‌, విజిలెన్స్‌, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

_*?ఓం…నమో…వేంకటేశాయా!!!* ?_

SHARE