ఇంద్రకీలాద్రిలో వసంత నవరాత్రి ఉత్సవాలు

130

THE BULLET NEWS (VIJAYAWADA)-ఉగాది పర్వదినం పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిలో వసంత నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, పుష్పార్చనలు నిర్వహించనుండటంతో… దుర్గమ్మ సన్నిధిలో ఉగాది శోభ సంతరించుకుంది.

ఉగాది ఉత్సవాలకు విజయవాడ శ్రీ కనకదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ముస్తాబవుతోంది… వసంత నవరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను విస్తృతంగా చేపట్టారు.. మార్చి 18 నుంచి 26 వరకు 9 రోజులపాటు అమ్మవారి ఆలయంలో విలంబి నామ సంవత్సర చైత్రమాస ఉగాది ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా దుర్గమ్మకు ప్రత్యేక పుష్పార్చనలు నిర్వహించనున్నారు. ఇంద్రకీలాద్రి క్షేత్రపాలకుడైన అభయాంజనేయ స్వామికి 24వ తేదీన లక్ష తమలపాకులతో పూజ నిర్వహించనున్నారు. 25న శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహిస్తారు. 26న శ్రీరామ పట్టాభిషేకం, వసంత నవరాత్రి ముగింపు, పూర్ణాహుతి, వసంతోత్సవం జరుగుతాయి.

మార్చి 18న ఉగాది పర్వదినం సందర్భంగా.. తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి సుప్రభాతం తర్వాత స్నపనాభిషేకం, ప్రభాత అర్చన నిర్వహిస్తారు. పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 8 గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఉదయం 9 గంటలకు నవరాత్రి కలశ స్థాపన, ప్రత్యేక పుష్పార్చనలు, అగ్నిప్రతిష్టాపన, మూలమంత్ర హవనం జరుగుతుంది. ఉదయం 10గంటల 30నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పంచాంగ శ్రవణం జరుగుతుంది. స్నపనాభిషేకం నిర్వహించనుండటంతో… వేకువజామున జరిగే ఖడ్గమాలార్చన, త్రికాలార్చన, స్వర్ణ పుష్పార్చనలను రద్దు చేశారు.

ఉగాది పండుగ సందర్బంగా.. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామిని వెండి రథంపై నగర వీధుల్లో ఊరేగిస్తారు. బ్రాహ్మణ వీధిలోని జమ్మిచెట్టు నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపు… శ్రీనివాస మహల్, మొయిన్ రోడ్డు మీదుగా పోలీస్ స్టేషన్, కాళేశ్వరరావు మార్కెట్, వినాయక గుడి, రథం సెంటర్ మీదుగా కొండపైకి చేరుకుంటుంది. వెండి రథంతో పాటు అమ్మవారి ప్రచార రథాన్ని విద్యుత్ దీపకాంతులతో పుర వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తారు… 9 రోజులపాటు దుర్గగుడిలో నిర్వహించే ఈ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు భారీగా తరలివస్తారని భావిస్తున్నారు. ఉగాది ఉత్సవాలకు అమ్మవారి ఆలయాన్ని ముస్తాబుచేస్తున్న అధికారులు… భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉగాది పండుగను కన్నులపండుగా నిర్వహించే ప్రయత్నాల్లో అధికారులు నిమగ్నమయ్యారు.

SHARE