ఆ మూడు కొండల నడుమ ఏముంది..?

165

The bullet news(yaganti)- మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి అనేక ఆసక్తికర అంశాలకు నిలయం. ఇక్కడ ఒక్క కాకి కూడా కనిపించదు. రాతి బసవేశ్వరుడు అంతకంతకు పెరుగుతున్నాడు. అనంతపురం జిల్లా లేపాక్షిలోని నంది విగ్రహం తరువాత రెండో భారీ విగ్రహం యాగంటి బసవన్న విగ్రహం. శివుడు విగ్రహ రూపంలో ఉన్న అరుదైన క్షేత్రం ఇది. శివపార్వతులు విగ్రహ రూపంలో పూజలు అందుకుంటున్న ఆలయం ఇది. దేశంలో ఏ శైవ క్షేత్రంలోనూ ఇలా శిలా విగ్రహంలో ఉమామహేశ్వరులు దర్శనమివ్వరు.

ఉమామహేశ్వరులు స్వయంభువుగా వెలిశారు. దేవనాగరి శైలిలో ఆలయాన్ని నిర్మించారు. తూర్పు చాళుక్యుల కాలంలో యాగంటి క్షేత్ర గర్భగుడిని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ముస్లింల దాడుల కారణంగా ఆలయ నిర్మాణం పూర్తి స్థాయిలో సాగలేదు. హరిహర బుక్కరాయల కాలంలో ఈ ఆలయ గోపురాన్ని నిర్మించి పూర్తి చేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ కాలంలోనే యాగంటి బసవయ్యను శిల్పులచే చెక్కినట్లు ఆధారాలు ఉన్నాయి. యాగంటి బసవయ్య ప్రతి 20 ఎళ్లకు ఒక అంగుళం పెరుగుతున్నట్లు పురాతత్వశాఖ అంచనా వేసింది.

కాకులు ఎందుకు కనిపించవు..?
యాగంటి క్షేత్రంలో కాకులు కనిపించకపోవడం వెనుక పౌరాణిక నేపథ్యం ఉంది. ఎర్రమలలోని మూడు కొండల మధ్య అగస్థ్య మునీశ్వరుడు తపస్సు చేసేవాడు. ఈ ప్రాంతం దట్టమైన అడవి మధ్యలో ఉండేది. మునీశ్వరుడి కఠోర తపస్సును భగం చేసేందుకు కాకాసురుడు అనే రాక్షసుడు వేలాది కాకులను పంపించాడు. వాటి గోలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. తన తపస్సు చెడగొట్టడానికి కాకాసురుడు ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న అగస్థ్యుడు యాగంటి కొండల పరిసర ప్రాంతాల్లో కాకులు సంచరించకుండా శపించాడు. అప్పటి నుంచి ఈ క్షేత్రం పరిధిలో కాకులు కనిపించడం లేదన్నది భక్తుల విశ్వాసం. క్షేత్రంలో శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదాన సంస్థ, రెడ్డి నిత్యాన్నదాన సంస్థ, ఆర్యవైశ్య నిత్యాన్నదాన సంస్థ, బ్రాహ్మణ నిత్యాన్నదాన సంస్థ ఉన్నాయి. భక్తులు తినగా మిగిలిన ఎంగిలి మెతుకులను నిత్యం ఈ ప్రాంతంలో వేస్తుంటారు. ఎంగిలి మెతుకులు ఉన్నచోట కాకులు వాలడం సహజం. దీనికితోడు పచ్చని చెట్లు, కొండలు అనుకూలంగా ఉన్నా.. కాకులు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

నవగ్రహ పూజలు లేవు..
యాగంటి క్షేత్రంలో నవగ్రహ పూజలు లేవు. ఆలయ ఆవరణలో నవగ్రహాలు లేవు. అన్ని ఆలయాల్లో నవగ్రహ విగ్రహాలు ఉండటం, ప్రత్యేక పూజలు, ప్రదక్షిణలు చేయడం సాధారణం. కానీ శనీశ్వరుడి వాహనమైన కాకికి ఇక్కడ ప్రవేశం లేనందున ఆయన సంచారం లేదని, అందుకే పూజలు, నవగ్రహ విగ్రహాలు లేవని అర్చకులు చెబుతున్నారు. ఉమామహేశ్వరులను సేవిస్తే శని ప్రభావం తొలగిపోతుందని భక్తుల నమ్మకం.

యాగంటి బసవయ్య
యాగంటి బసవయ్యకు విశిష్ఠత ఉంది. ఆలయం ఎదురుగా భక్తులకు దర్శనమిచ్చే నందీశ్వరుడు అంతకంతకు పెరుగుతాడని కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి పేర్కొన్నారు. 90 ఏళ్ల క్రితం నాలుగు స్తంభాల మధ్యలో ఉన్న నంది విగ్రహానికి ప్రదక్షిణ చేసేవారు. ప్రస్తుతం విగ్రహ పరిమాణం పెరిగిన కారణంగా ఓ స్తంభానికి నంది విగ్రహం ఆనుకుంది. నందీశ్వరుడిని ఆనుకుని ఉన్న అరుగు ముందుకు జరిగింది. దీంతో ప్రదక్షిణలు చేసే వీలు లేకుండా పోయింది. ప్రతి 20 సంతవ్సరాలకు నందీశ్వరుడు ఒక అంగుళం పెరుగుతున్నట్లు పురాతత్వ శాఖ అంచనా వేసింంది. ఈ వివరాలను తెలియజేస్తూ దేవాదాయ శాఖ ఆలయ ప్రాంగణంలో బోర్డును ఏర్పాటు చేసింది. నంది విగ్రహ పరిమాణం పెరగడానికిగల కారణాలను తెలుసుకునేందుకు దేశవిదేశీ శాస్త్రవేత్తలు పరిశోధించారు. యాగంటి బసవేశ్వరుడు అంతకంతకు పెరిగి లేచి రంకె వేస్తాడని, ఆ సమయంలోనే కలియుగం అంతం అవుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది.

కోనేటి నీరు 16 ఎకరాలకే..
క్షేత్రంలోని పై కొండల నుంచి నిత్యం నీరు ప్రవహిస్తుంటుంది. మండు వేసవి సహా అన్ని కాలాలలోనూ నీటి ధారలో ఏమాత్రం తేడా ఉండదు. ఈ నీరు చిన్నకొనేరు నుంచి పెద్ద కొనేరు వరకు ప్రవహిస్తుంది. పెద్దకొనేరులో భక్తులు స్నానమాచరిస్తారు. అక్కడి నుంచి సమీపంలోని 16 ఎకరాల్లోని కొబ్బరి తోటల వరకు మాత్రమే నీల్లు ప్రవహిస్తాయి. అంతకు మించి ఒక్కడ అడుగూ ముందుకు వెళ్లకుండా భూమిలో ఇంకిపోతాయి.

విగ్రహ రూపంలో ఉమామహేశ్వరులు
దేశంలోని అన్ని శివాలయాల్లో లింగం రూపంలో శివుడు దర్శనమిస్తారు. యాగంటి క్షేత్రంలో మాత్రం ఉమామహేశ్వరులు విగ్రహ రూపంలో భక్తులకు దర్శనమివ్వడం విశేషం. దీని వెనుక కూడా అగస్థ్యుడి తపో నేపథ్యమే ఉంది. మొదట వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని అగస్థ్యుడు ప్రయత్నించాడని, అయితే విగ్రహం తయారు చేసేటప్పుడు కుడికాలు విరిగింది. దీంతో విగ్రహం పూజకు పనికిరాకుండా పోయింది. అందుకే వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ ఆలోచనను విరమించుకున్నారు. అనంతరం అగస్థ్య మునీశ్వరుడు శివ పార్వతుల గురించి తపస్సు చేశాడు. వారు ప్రత్యక్షమై ఈ ప్రాంతంలో గంగ తీర్థం ఉందని, కాబట్టి శివాలయాన్ని నిర్మించాలని సూచించారు. తాము విగ్రహ రూపంలో భక్తులకు దర్శనమిస్తామని వరమిచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. క్షేత్రంలో ఉమామహేశ్వరులు ఏకశిలా రూపంలో దర్శనమిస్తారు.

విశేషాల నిలయం..
యాగంటి క్షేత్రం అనేక విశేషాల నిలయం. యుగయుగాల నుంచి ఇక్కడ కాకులకు ప్రవేశం లేదు. ఇక్కడ ప్రవహించే పుష్కరణి నీరు 16 ఎకరాలకు మించి పారవు. భూమిలో ఇంకిపోతాయి. ఉమామహేశ్వరులు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఏకకై క్షేత్రం ఇది. నందీశ్వరుడు కూడా అంతకంతకు పెరుగుతున్నాడు. అగస్థ్య ముని తపస్సు చేసిన గుహ, ఆలయ పరిసరాల్లో కోనేటి నీళ్లు, పచ్చటి చెట్లు, ఎత్తైన కొండలతో ఆధ్యాత్మిక వాతావరణం పరిఢవిల్లుతోంది

SHARE