అద్భుతం.. అబ్బురం .‘వెలుగు’ చూసిన సొరంగం!

118

The bullet news(rapuar)-తిరుమల ఘాట్‌రోడ్డును తలపించేలా వెలుగొండలో గురువారం మరో అద్భుతం ఆవిష్కృతమైంది. సహజ సిద్ధమైన నిలువెత్తు కొండలు.. దట్టమైన అడవులు.. కనువిందు చేసే జలపాతాలు, వన్యప్రాణులతో నిం డిన తూర్పు కనుమల్లో రైలు మార్గానికి మార్గం సుగమమైంది. కృష్ణపట్నం-ఓబులవారిపల్లి రైల్వే లైన్‌ నిర్మాణంలో భాగంగా ఇక్కడి ఏడుకొండల్లో చేపట్టిన రైల్వే సొరంగ మార్గం తొలిదశ నిర్మాణ పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. దీంతో దక్షిణ భారతంలోనే అతి పెద్ద రైల్వే సొరంగమార్గంగా ఇది రికార్డులకెక్కనుంది.

ఇదీ ప్రత్యేకత…
అటు కడప జిల్లా చిట్వేలి మండలం చెర్లోపల్లి సమీపంలోని అడవుల నుంచి, ఇటు డక్కిలి మండలం మాధవాయపాలెం సమీప అడవుల వరకు ఈ సొరంగాన్ని మలిచారు. అటు నుంచి 960 మీటర్లు, ఇటు నుంచి 6.6 కిలోమీటర్లు వెరసి 7.5 కిలోమీటర్ల సొరంగాన్ని 8 మీటర్ల ఎత్తు, 7.5 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. రూ.500 కోట్ల అంచనా వ్యయంతో 2015 మే, నవంబర్‌ నెలల్లో పనులు ప్రారంభించారు. అటువైపు సొరంగమార్గాన్ని 2016లోనే పూర్తిచేశారు. ఇటువైపు 6.5 కిలోమీటర్ల వరకూ చేపట్టి ఆపేశారు.
ఎట్టకేలకు గురువారం రాత్రి 6 గంటలకు చెన్నై రైల్వే వికాస్‌ నిగామ్‌ లిమిటెడ్‌(ఆర్‌వీఎన్‌ఎల్‌) జనరల్‌ మేనేజరు, సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పనులు కొనసాగించారు. చివరికి ఒక మీటరు మిగిలి ఉండడంతో బ్లాస్టింగ్‌ జరపగా సొరంగం పూర్తయింది. దీంతో తొలి దశ నిర్మాణ పనులు పూర్తయినట్లు ఆర్‌వీఎన్‌ఎల్‌ అధికారులు ప్రకటించారు. లోపల ప్రత్యేకంగా భారీ పైప్‌లు ఏర్పాటుచేసి ఆక్సిజన్‌, గాలి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. సొరంగంలో సిమెంటు కాంక్రీటు ప్లాస్టరింగ్‌, విద్యుత్‌ సదుపాయం, రైల్వే ట్రాక్‌ పనులు చేపట్టాల్సి ఉంది.
SHARE