ద్రావిడ్ కోచ్ గా ఉండడం మా అదృష్టం-అండర్-19 క్రికెట్ జట్టు

33

THE BULLET NEWS (NEWS DELHI)-రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా ఉండడం తమ అదృష్టమని అండర్ 19 స్టార్స్ సుభ్మన్ గిల్, పృథ్వి షా పేర్కొన్నారు. బే ఓవల్‌లో భారత అండర్ 19 క్రికెట్ జట్టు ఇవాళ నాలుగోసారి ప్రపంచ కప్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంటులో మొత్తం 372 పరుగులు సాధించిన గిల్.. మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంటుగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తమను విజయం వైపు నడిపించిన ఘనత రాహుల్ ద్రవిడ్‌దేనంటూ గిల్ పేర్కొన్నాడు. ‘‘రాహుల్ సార్ కోచ్‌గా ఉండడం మా అదృష్టం… ఎప్పుడూ నాకు నచ్చినట్టు స్వతంత్రంగా ఆడేలా ఆయన ప్రోత్సహించారు. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు గ్రౌండ్ మొత్తం ఆడేలా శిక్షణ ఇచ్చారు. ఆ కారణంగానే నేను ఇన్ని పరుగులు చేయగలిగాను. జట్టు సభ్యుల విషయంలో గర్వంగా ఫీలవుతున్నా. మా అందరికీ ఇదో అద్భుత అనుభవం..’’ అని గిల్ పేర్కొన్నాడు.మరోవైపు కెప్టెన్ పృథ్వి షా మాట్లాడుతూ… ‘‘ఈ ఘనత అంతా మా వెనుక ఉన్న సిబ్బందికే చెందుతుంది. రెండేళ్ల నుంచి వారు మాకు చాలా అండగా నిలిచారు. ఆటగాళ్లు కూడా బాగా రాణించారు. రాహుల్ సార్ నిజంగా లెజండ్..’’ అని ప్రశంసించాడు. ఈ విజయాన్ని మాటల్లో వర్ణించలేనని పేర్కొన్నాడు. ఓపెనింగ్ ఆటగాడు మన్‌జోత్ కార్లా చేసిన అద్భుత సెంచరీ ఫైనల్‌లో గెలుపు తెచ్చిపెట్టిందని ప్రశంసించాడు. పేస్ బౌలర్లు శివం మావి, కమలేశ్ నాగర్‌కోటిలపై ప్రశంసలు కురిపించాడు. ప్రత్యేకించి తమకు అండగా నిలిచిన భారత అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నాడు.

 

SHARE