ప్రజలకు ఏపీ ప్రభుత్వం షాక్…!! వంట గ్యాస్ ధర భారీగా పెంపు

నిత్యవసర వస్తువుల ధరలు పెరిగితే… పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు దేవుడే దిక్కనుకుంటారు. ముఖ్యంగా వంటగ్యాస్ ధర పెరిగిందనే వార్త తెలిస్తే చాలు… గుండెల్లో బండ పడినట్లే ఫీలవుతారు. ఎందుకంటే… తెల్లారి లేస్తే… ఏది వండుకోవాలన్నా… గ్యాస్ స్టవ్ వెలిగించాల్సిందే. నెల తిరిగేటప్పటికే… బండ అయిపోతుంది. కొత్త బండ బుక్ చేసుకోవాలంటే… జేబులు తడుముకోవాల్సిందే. ఇలాంటి సమయంలో… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… వంట గ్యాస్‌ ధరలు పెంచి షాక్ ఇస్తోందనే విమర్శలు వస్తున్నాయి. కరోనా వైరస్‌ వల్ల పడిపోయిన రెవెన్యూను పెంచుకునేందుకు గ్యాస్‌ ధరలపై వ్యాట్‌ను భారీగా పెంచింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. వాటి కోసం కేటాయించేందుకు నిధులు లేకపోతే… అప్పులు కూడా చేస్తోంది. అయినప్పటికీ ఇంకా డబ్బు కావాల్సి వస్తోంది. అందువల్ల ప్రభుత్వం నిత్యవసర వస్తువైన వంట గ్యాస్‌పై వ్యాట్‌ను 14.5 శాతం నుంచి 24.5 శాతం దాకా పెంచింది. ఇందుకు సంబంధించి ఆదేశం కూడా జారీ అయ్యింది. ఈ పెంపు నిర్ణయం ఎందుకు తీసుకున్నదీ ప్రభుత్వం తన ఆదేశంలో వివరంగా చెప్పింది. కానీ… వంట గ్యాస్ ధర భారీగా పెరగబోతోందన్న మాటను తట్టుకునే స్థితిలో ఏపీ ప్రజలు లేరన్నది ప్రతిపక్షాల మాట.ఆర్థిక వేత్తలు మొదటి నుంచి ఈ విషయంపై వ్యతిరేకతతోనే ఉన్నారు. సంక్షేమ ఫలాలు, పథకాలూ ఎక్కువగా ప్రకటిస్తే… వాటిని నెరవేర్చడం కోసం రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి వస్తుందంటున్నారు. ఏపీలో అలాంటి పరిస్థితే ఏర్పడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో హామీలను నెరవేర్చాల్సిందే అనుకుంటున్న ప్రభుత్వం… ఆదాయం కోసం రకరకాల మార్గాల్ని అన్వేషిస్తోంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఏపీలో వంట గ్యాస్ ధరలు పెరగనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here