రేపు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ

జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఈ నెల 25న శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనుండగా, జిల్లాలో అధికార యంత్రాంగం అన్ని ప్రాంతాల్లో లేఅవుట్లు ఏర్పాటు చేయడంతోపాటు రిజిస్ట్రేషన్‌ పత్రాలనూ సిద్ధం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 87,754 మందికి పట్టాలు పంపిణీ చేయనున్నారు. అయితే, మున్సిపాలిటీల పరిధిలో 50 నుంచి 60 శాతం మాత్రమే  పట్టాలు ఇవ్వనున్నారు. సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 1,129 మందిని ఎంపిక చేయగా, 787 మందికి మాత్రమే  పట్టాలు ఇవ్వనున్నారు. గూడూరులో 3,318 మందిని ఎంపిక చేయగా 2,633 మందికి, నెల్లూరు నగరంలో 28 వేలకి 14,972 మందికి, కావలిలో 9వేల మందికి 3వేల మందికి మాత్రమే స్థలాలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో స్థలాల వివాదం, సేకరణ ఇబ్బంది కలగకపోవడంతో 90శాతం మేర పంపిణీకి లేఅవుట్లు సిద్ధమయ్యాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో 11,282 మందికి, గూడూరులో 7,464 మందికి, కావలిలో 6,438 మందికి, కోవూరులో 20,196 మందికి, నెల్లూరు రూరల్‌లో 1635 మందికి, సూళ్లూరుపేటలో 7,664 మందికి, సర్వేపల్లిలో 15,632 మందికి, ఉదయగిరిలో 12,610 మందికి, వెంకటగిరిలో 4,032 మందికి, ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తున్నారు. మొత్తం 46 మండలాల్లో 2,887 ఎకరాల్లో 1481 లేఅవుట్లను అధికారులు ఏర్పాటు చేసి 1.5 సెంటు చొప్పున 87,754 మందికి పంపిణీ చేయనున్నారు. అలాగే లేఅవుట్లలో రోడ్లు, కాలువలు, వీధిలైట్లు వంటి మౌలిక సదుపాయాలతోపాటు భారీగా మొక్కలు నాటారు.

మున్సిపాలిటీలలో ఇబ్బందులు

పట్టణ ప్రాంతాల్లో స్థల సేకరణ అధికారులకు ఇబ్బందిగా మారింది. పట్టణాలకు ఆనుకొని ప్రభుత్వ స్థలాలు లేకపోవడం, దూరంగా ఉండే స్థలాలు ఉపయోగకరం కాకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు పొలాలను కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే స్థలాల కొనుగోళ్లకు సంబంధించి కావలిలో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి.  రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిన కొంతమంది నేతలు అధిక మొత్తాన్ని ప్రభుత్వానికి చూపడంపై ఫిర్యాదులు రావడంతో దాదాపు 100 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాలేదు. దీంతో ఆ పొలాల్లో లేఅవుట్ల ఏర్పాటుకు ఆలస్యమవుతోంది. అలాగే నెల్లూరులోని వెంకటేశ్వరపురం ప్రాంతంలో కొంతమేర ప్లాట్లు ఇస్తున్నా ఇటీవల కురిసిన భారీ వర్షానికి పూర్తిగా నీట మునిగాయి. దీంతో నీటిని తరలించేందుకు అధికార యంత్రాంగం నానా తంటాలు పడుతోంది. అలాగే మరో 14వేల మందికిపైగా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు భూమి సేకరించాల్సి ఉంది.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here