కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసి ప్రాణ దాతలు కండి జిల్లా కలెక్టర్ .

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు మరియు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం వారు సంయుక్తముగా చేపట్టిన ప్లాస్మా దానం గురించిన అవగాహనా గోడ ప్రతులను మరియు కరపత్రాలను క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ కెవియన్.చక్రధర్ ఆవిష్కరించారు . ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరు ప్లాస్మా దానం చేసి అదే వైరస్‌తో బాధపడుతున్న మిగతా రోగులకు సహాయం చేయాలని కోరారు. కరోనా విజృంభిస్తున్న వేళ ప్లాస్మా దానంను ప్రోత్సహించడాన్ని ప్రతి ఒక్కరం బాథ్యత గా తీసుకుందామని పిలుపునిచ్చారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి ఒక్కసారి చేసే ప్లాస్మా దానం వలన కోవిడ్ తో పోరాడుతున్న మరో ఇరువురిని బ్రతికిస్తుం దని తెలిపారు. ప్లాస్మా దానం చేయు వారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వము 5000 రూపాయలు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారని తెలిపారు. రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ పి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ అత్యాధునిక వైద్య పరికరాల ద్వారా మరియు అనుభవము గల వైద్యుని పర్యవేక్షణలో పరిశుభ్రమైన వాతావరణము గల రెడ్ క్రాస్ ప్రాంగణములో ప్లాస్మాను సేకరిస్తారు అని తెలిపారు. ప్లాస్మా దానం చేయగోరువారు తమ సందేహాలను మరియు అపోహలను నివృత్తి చేసుకోవటానికి అలాగే ప్లాస్మా దానం గురించి పూర్తి వివరాలను తెలుసుకోవటానికి, కూరగాయల మార్కెట్ వద్ద గల రెడ్ క్రాస్ కార్యాలయాన్ని సందర్శించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాతీయ సేవా పథకం (NSS) సమన్వయ అధికారి మరియు యూత్ రెడ్ క్రాస్ కో-కన్వీనర్ డా. ఉదయ్ శంకర్ అల్లం పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here