గగన్ యాన్ కోసం “గ్రీన్ ప్రోపల్షన్ – ఇస్రో చైర్మన్

ఇస్రో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మానవ సహిత అంతరిక్షయాత్ర ‘గగన్‌యాన్‌’కు గ్రీన్‌ ప్రొపల్షన్‌ను వినియోగిస్తామని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ తెలిపారు. ఇప్పటికే గ్రీన్‌ప్రొపల్షన్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో దీనిని అనేక రాకెట్‌ ప్రయోగాల్లో ఉపయోగిస్తామని ఆయన పేర్కొన్నారు. చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ 16వ స్నాతకోత్సవానికి అతిథిగా హాజరైన ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. విద్యార్థులంతా కచ్చితంగా రిస్క్‌ తీసుకోవాలని ఆయన కోరారు. ఏమీ సాధించకుండా ఉండటం కన్నా ఏదోకటి ప్రయత్నించి విఫలమైనా తప్పులేదని విద్యార్థులకు సలహా ఇచ్చారు.

గ్రీన్‌ ప్రొపల్షన్‌ అభివృద్ధి..
భారతదేశం ఆర్థిక వృద్ధిపై దృష్టి సారిస్తూనే, పర్యావరణ సమతౌల్యాన్ని రక్షించాలని కూడా ప్రయత్నిస్తోందని శివన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో పర్యావరణహిత సాంకేతికతను అభివృద్ధి చేయాల్సిన అవసరముందని తెలిపారు. ఈ తరహాలోనే ఇస్రో లిథియం-అయాన్‌ బ్యాటరీలను అభివృద్ధి చేసిందని ఆయన తెలిపారు. అంతరిక్ష వాహనాలను పూర్తి స్థాయిలో నడిపేలా గ్రీన్‌ ప్రొపెల్లర్స్‌ను ఇస్రో అభివృద్ధి చేస్తోందన్నారు. దీనిని భారత ప్రతిష్టాత్మక అంతరిక్ష మిషన్‌ ‘గగన్‌యాన్‌’లో కూడా వినియోగిస్తామని ఆయన తెలిపారు. గగన్‌యాన్‌ను ముందుగా 2021 డిసెంబర్‌ సమయానికి ప్రారంభించాలని ఇస్రో ప్రణాళిక వేసింది. కానీ కరోనా కారణంగా ఇది మరో సంవత్సరం ఆలస్యం కావచ్చొని ఇస్రో ఈ నెల ఆరంభంలో ప్రకటించింది. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రభుత్వేతర సంస్థలకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక సంస్కరణలు చేసిందని ఆయన తెలిపారు. తమ తదుపరి పీఎస్‌ఎల్వీ (పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌)ను ఒక అంకుర సంస్థ అభివృద్ధి చేస్తోందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. 2011లో ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులు తయారు చేసిన శాటిలైట్‌ (ఎస్‌ఆర్‌ఎంఎస్‌ఏటీ) చాలా బాగా పనిచేస్తోందని ఆయన విద్యార్థులకు తెలిపారు. ఇస్రో వినూత్న ఆలోచనలను ఎప్పుడూ ఆహ్వానిస్తుందని ఆయన ఉద్ఘాటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here