‘తిరుపతి’ ఉప ఎన్నికపై టీడీపీ ఐదంచెల వ్యూహం

తిరుపతి పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ ఐదంచెల వ్యూహం రూపొందించింది. కేడర్‌ నుంచి లీడర్‌ వరకూ క్షేత్రస్థాయిలోనే ఉండేలా ఈ వ్యూహం సిద్ధమయింది. పోలింగ్‌ కేంద్రాలు, పంచాయతీలు.. మండలాలు..అసెంబ్లీ.. పార్లమెంటు.. ఇలా ఐదు అంచెల్లో తిరుపతి లోక్‌సభ పరిధిలోని ప్రతి ఓటరునూ చేరేందుకు 9143 మంది సుశిక్షితులైన పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కార్యక్షేత్రంలోకి దిగడానికివీలుగా ఎన్నికల నోటిఫికేషన్‌ జారీకి ముందే తన అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మిని టీడీపీ ప్రకటించింది. తద్వారా తిరుపతి ఎన్నికల క్షేత్రంలో దూకుడు ప్రదర్శించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్నట్లు తెలుస్తోంది.

ఐదంచెలు ఇవే..

పోలింగ్‌ కేంద్రం : పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల్లో పనిచేసేందుకు 8వేల మంది కార్యకర్తలను ఎంపిక చేశారు. 

పంచాయతీ : పంచాయతీ స్థాయిలో ప్రచారం కోసం వెయ్యిమందిని సిద్ధం చేశారు.

మండలం : మండలాల స్థాయిలో ఎన్నికల విధులకు 40మంది నాయకులకు బాధ్యతలు. అన్ని మండలాల పర్యవేక్షణకు 89మందితో ఒక కమిటీని నియమించారు.

అసెంబ్లీ : పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు మాజీ మంత్రులు, పొలిట్‌బ్యూరో స్థాయి నేతలు, మాజీ ఎంపీలతో కూడిన 8 మంది నేతల కమిటి.

పార్లమెంటు : పార్లమెంటు నియోజకవర్గ పర్యవేక్షణకు ఆరుగురు కీలక నేతలతో మరో కమిటీ ఏర్పాటుచేశారు.

‘ఐ-టీడీపీ’ యాప్‌ ప్రారంభించిన చంద్రబాబు 

టీడీపీ నాయకత్వానికి, కార్యకర్తలకు మధ్య సత్వర సమాచార వారధిగా టీడీపీ డిజిటల్‌ వింగ్‌ ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం ‘ఐ-టీడీపీ యాప్‌’ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలపై తమ గొంతు వినిపించే వేదికగా ఈ యాప్‌ను డిజైన్‌ చేశారని చెప్పారు. సోషల్‌ మీడియా వేదికలన్నీ ఒకే చోట క్రోడీకరించే వన్‌ స్టాప్‌ యాప్‌గా ఉపయోగపడుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here