నెల్లూరులో దడ పుట్టిస్తున్న కరోనా స్ట్రెయిన్‌ ?

కరోనా మహమ్మారి సింహపురిని పట్టి పీడిస్తోంది. ఈ ఏడాది మార్చి నెలలో రాష్ట్రంలోనే మొదటి కరోనా పాజిటివ్‌ కేసు నెల్లూరులోనే నమోదు అయ్యింది. ఇప్పుడు కరోనా స్ట్రెయిన్‌ అనుమానిత కేసులు నెల్లూరులోనే నమోదు కావడంతో అన్ని వర్గాలను కలవరపాటుకు గురిచేసింది. ఇప్పటికే ఇద్దరు అనుమానిత స్ట్రెయిన్‌ బాధితులను గుర్తించిన వైద్య ఆరోగ్య శాఖ పరీక్షల కోసం నమూనాలను పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపేందుకు సిద్ధమవుతున్నారు. యూకేలో వెలుగు చూసిన కరోనా స్ట్రెయిన్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యూకే నుంచి దేశానికి వచ్చే విమానాలను రద్దు చేయగా, అక్కడ నుంచి వచ్చిన వారికి తప్పనిసరిగా కరోనా స్ట్రెయిన్‌ పరీక్షలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గడిచిన 20 రోజులలో యూకే నుంచి జిల్లాకు వచ్చిన వారిని వైద్య ఆరోగ్య శాఖ అధికారులో గుర్తించే పనిలో పడ్డారు. వారందరికి స్ట్రెయిన్‌ పరీక్షలు చేయగా, అనుమానిత కేసులు వెలుగు చూడటంతో ఆ శాఖ మరింత అప్రమత్తం అయ్యింది. కలెక్టర్‌ చక్రధర్‌బాబు వైద్యాధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కరోనా సెకండ్‌వేవ్‌ దచ్చిందేమోనన్న అనుమానం జిల్లావాసుల్లో వ్యక్తమవుతోంది.

ఆ 13 మంది ఎక్కడున్నారో…ఇదిలా ఉంటే ఇప్పటివరకు యూకే నుంచి జిల్లాకు 47 మంది రాగా, ఇప్పటివరకు 34 మందిని గుర్తించిన వైద్య శాఖ వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. వీరిలో 23 మందికి నెగిటివ్‌ రాగా ఒకరికి మాత్రం పాజిటివ్‌ వచ్చింది. మరో 10 మంది ఫలితాలు రావాల్సి ఉంది. మరో 13 మంది వివరాలను సేకరిస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన యువకుడు (34) లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 11వ తేదీన నెల్లూరుకు చేరుకున్న ఆ యువకుడికి ముందుగా లండన్‌లో కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్‌ వచ్చింది. అయితే, నెల్లూరులో జరిపిని పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులను పరీక్షించగా యువకుడి తల్లికి పాజిటివ్‌ రాగా, ఇద్దరినీ జీజీహెచ్‌కు తరలించారు.

24 కరోనా కేసుల నమోదు జిల్లాలో శుక్రవారం 24 కరోనా పాజిటివ్‌లు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 63,593లకు చేరుకున్నాయి. అలాగే కరోనా నుంచి కోలుకున్న 20 మంది బాధితులను అధికారులు డిశ్చార్జ్‌ చేశారు.

ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్‌ మనుబోలు ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మండలంలోని మండలంలోని కొలనుకుదురు, చెర్లోపల్లికి చెందిన పిల్లాలకు ఇటీవల నిర్ధారణ పరీక్షలు చేశారు. శనివారం వెల్లడించిన ఫలితాల్లో ఇద్దరికి కరోనా సోకినట్లు గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here